కలం, ఖమ్మం బ్యూరో: ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించపోతే సెప్టెంబర్ మొదటి వారంలో ‘చలో అసెంబ్లీ’ ముట్టడి చేపడతామన్నారు. ఈ మేరకు గురువారం ఏన్కూరు మండల తహసీల్దార్ శేషగిరిరావు ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు డి.ఎస్. నాగేశ్వరరావు, వెంకటప్పయ్య, హతీరామ్ మాట్లాడారు. మూడేళ్లుగా పీఆర్సీ అమలకు నోచుకోలేదని, 6 డీఏలు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, అశాస్త్రీయ జీవో 25ను సవరించాలని, గిరిజన సంక్షేమ శాఖలో ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ సిబ్బందికి మినిమమ్ బేసిక్ పే ఇచ్చి, సమ్మె కాలపు జీతాన్ని చెల్లించాలని కోరారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్లో ‘మహాధర్నా’, సెప్టెంబర్ మొదటి వారంలో ‘చలో అసెంబ్లీ’ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్పీసీ ప్రతినిధులు బి. రామ్చంద్, మూడ్ పుల్లయ్య, నరసయ్య, బి. లక్ష్మ, జి. నాగరాజు పాల్గొన్నారు.

