కలం, కరీంనగర్: హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం చొప్పదండి పట్టణ, తిమ్మాపూర్ భారతీయ జనతా పార్టీ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ (Har Ghar Tiranga Rally) నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం తిరంగా ర్యాలీలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా ర్యాలీలు కొనసాగాయి. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2022 నుండి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి, జాతీయ జెండాతో ప్రతి పౌరుడికి గల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ వేడుక ఎంతగానో దోహదపడుతుందన్నారు.
కేవలం అధికారిక వేడుకలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో ప్రత్యక్షంగా మమేకం కావాలనే లక్ష్యంతో ఈ అభియాన్ కొనసాగుతోందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను వారి త్యాగాలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ప్రతి ఇల్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై మువ్వన్నెల జెండాను గర్వంగా ఎగరవేయాలని కోరారు.
ఈ ర్యాలీలో ప్రోగ్రాం ఇంచార్జి రాష్ట్ర కార్యదర్శి ఓబిసి మోర్చా రాజు అడిచెర్ల, చొప్పదండి పట్టణ అధ్యక్షులు చిల్ల శ్రవణ్ కుమార్, 8వ వార్డు కౌన్సెలర్ రాజన్నల రాజు, 13వ వార్డు కౌన్సిలర్ జిట్టా మంగ-కుమార్, జిల్లా యువమోర్చా అధ్యక్షులు సంగ నరేష్, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, మంచికట్ల మల్లేష్, చల్ల అనుష్, పెంచికల రమాదేవి, గంగు సంపత్, మనీష్ రెడ్డి, అమరగొండ తిరుపతి, అశోక్, గుర్రం చంద్రశేఖర్ రెడ్డి, వివిధ విద్యాసంస్థల నుండి విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
తిమ్మాపూర్ మండలంలో జరిగిన తిరంగా ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మండలాధ్యక్షులు చింతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, మువ్వరపు సంపత్, బూట్ల శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, వేల్పుల ఓదెలు, పాఠకుల చొక్కయ్యలతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

