తెలంగాణ నర్సస్ అసోసియేషన్‌కు జాతీయ గుర్తింపు!

క‌లం, వెబ్‌డెస్క్: తెలంగాణ నర్సెస్ అసోసియేషన్‌ (Telangana Nurses Association) కు ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ (AIGNF) అనుబంధ గుర్తింపు కల్పించింది. ఈ మేరకు ఫెడరేషన్ కార్యదర్శి జనరల్ జీకే ఖురానా తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీకి లేఖ ద్వారా సమాచారం అందించారు. 2026 సంవత్సరానికి ఈ అనుబంధం వర్తిస్తుందని లేఖ‌లో పేర్కొన్నారు. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్‌తో అనుబంధం ఏర్పడటం పట్ల ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు, ఈఎస్‌ఐసీ, మున్సిపల్‌ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రజారోగ్య నర్సింగ్‌ సేవలు, నర్సింగ్‌ విద్యా రంగాలకు చెందిన సంఘాలను న‌ర్సింగ్ ఫెడ‌రేష‌న్‌ అనుబంధంగా కలిగి ఉంది. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్‌కు అనుబంధం మంజూరు చేసిన విషయాన్ని తెలంగాణ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఫెడరేషన్ లేఖ ద్వారా తెలియజేసింది.

తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది వృత్తిపరమైన ప్రయోజనాలు, సేవా పరిస్థితులు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం 1963లో తెలంగాణ నర్సస్ అసోసియేషన్‌ను స్థాపించారు. దాదాపు 19 సంవత్సరాల పాటు నిరంతరంగా నర్సింగ్ సమాజానికి సేవలందించిన త‌ర్వాత‌ తెలంగాణ నర్సస్ అసోసియేషన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ నం.126/1982తో అధికారికంగా నమోదు చేశారు. ఈ అసోసియేష‌న్ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది సమస్యలను శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంతో, మంత్రులతో, ఉన్నతాధికారులతో చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తోంది.

ఏపీ నర్సుల చారిత్రక భాగస్వామ్యం

ఏఐజీఎన్ఎఫ్ చరిత్రను గుర్తు చేస్తూ సెక్రటరీ జనరల్ జీకే ఖురానా మాట్లాడుతూ.. 1988లో ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సస్ ఫెడరేషన్ ఏర్పాటుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. కనకాచార్లు నాయకత్వంలో ఏఐజీఎన్ఎఫ్ ఏర్పాటులో వారు భాగస్వాములయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి ఒక బలమైన జాతీయ వేదిక ఏర్పడటంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల భాగస్వామ్యం ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టంగా నిలిచింద‌న్నారు.

ఏపీ ప్రభుత్వ నర్సస్ అసోసియేషన్‌కు గుర్తింపు

అనంతరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహించే ఏకీకృత సంఘానికి ప్రభుత్వం 2008లో అధికారిక గుర్తింపు ఇచ్చింద‌ని తెలిపారు. ఈ గుర్తింపు నేపథ్యంలో రెండు ప్రాంతీయ సంఘాలు తెలంగాణ నర్సస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ నర్సస్ అసోసియేషన్ ఏర్ప‌డ్డ‌ట్లు వెల్ల‌డించారు. ఇవి రెండూ ఏకీకృతమై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి ఒకే సంఘంగా ప్రాతినిధ్యం వహించాయ‌ని తెలిపారు.

నర్సింగ్ ఉద్యమానికి మరింత బలం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ నర్సస్ అసోసియేషన్ తన స్వతంత్ర చారిత్రక గుర్తింపుతో ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది సమస్యలపై నిరంతరం పోరాడుతోంది. ప్రస్తుతం ఏఐజీఎన్ఎఫ్‌తో తెలంగాణ న‌ర్స‌స్ అసోసియేష‌న్‌కు లభించిన అధికారిక అనుబంధ గుర్తింపు, తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది సమస్యలను జాతీయ స్థాయిలో మరింత సమర్థవంతంగా ప్రస్తావించేందుకు ఒక ముఖ్యమైన అవకాశంగా అసోసియేష‌న్‌ భావిస్తోంది.

ఈ అనుబంధం ద్వారా ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది వృత్తిపరమైన గౌరవం, సేవా పరిస్థితులు, సంక్షేమం, కెరీర్ అభివృద్ధి, హక్కులు, నర్సింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై జాతీయ స్థాయిలో సమన్వయంతో పని చేసే అవకాశం మరింత పెరుగుతుంది. తెలంగాణ నర్సస్ అసోసియేషన్‌కు 2026 సంవత్సరానికి అనుబంధ గుర్తింపు అందించిన ఏఐజీఎన్ఎఫ్ అధ్యక్షురాలు అనితా పన్వార్, సెక్రటరీ జనరల్ జీకే ఖురానా, నేషనల్ అడ్వైసర్, ఏఐజీఎన్ఎఫ్ కార్యవర్గానికి తెలంగాణ నర్సస్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>