కలం, వెబ్ డెస్క్ : రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో(Assembly Winter Session) కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekanand) స్పష్టం చేశారు. గత రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచించిన తీరును అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై నిలదీస్తామని ఆయన వెల్లడించారు.
కొంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని వివేకానంద గుర్తు చేశారు. అయితే, మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల పరిస్థితి ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తామన్నారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు, రాష్ట్రంలో పెరుగుతున్న ఆటో డ్రైవర్లు, రైతుల ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భరోసా, వరి ధాన్యంతో పాటు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రచారం చేసి, ఇప్పుడు బోగస్ మాటలతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు.
పదిమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభలోనే ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు ఆ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండు, మూడు రోజులు నిర్వహించి మమ అనిపించవద్దని, ప్రతి ప్రజా సమస్యపై కూలంకషంగా చర్చించాలని వివేకానంద(KP Vivekanand) కోరారు.
Read Also: అందుకు ఒప్పుకుంటేనే భారత్‌లో స్టార్‌లింక్ సేవలు!
Follow Us On: Youtube


