కలం, కరీంనగర్ బ్యూరో: కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జఫర్‌ఖాన్ పేట గ్రామంలో రూ.5.43 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మద్దెల వాగు హై లెవల్ బ్రిడ్జి, గోదావరిఖని – జఫర్‌ఖాన్ పేట – పెద్దపల్లి ఆర్టీసీ బస్సు సర్వీసును స్థానిక అధికారులు, నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు (Vijaya Ramana Rao) జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ.. గతంలో గడప గడపకు తిరిగినప్పుడు రోడ్లు లేక, పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఈ రోజు లక్షల రూపాయల నిధులతో పాఠశాల పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు ఇండ్ల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రామంలోని వీధులన్నింటికీ సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. రూ.5.43 కోట్లతో మద్దెల వాగు బ్రిడ్జి పూర్తి చేయడమే కాకుండా, అప్రోచ్ రోడ్లకు అదనంగా మరో కోటి రూపాయలు ఖర్చు చేసి రవాణా కష్టాలను తీర్చామని తెలిపారు.
నియోజకవర్గానికి మహర్దశ
ముత్తారం, మంథని వెళ్లే ప్రయాణికుల చిరకాల వాంఛను తీరుస్తూ మంగపేట కూనారం టర్నింగ్ నుండి ముత్తారం వరకు రూ.32 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే పెద్దపల్లి – గర్రెపల్లి మేజర్ రోడ్డుకు రూ.100 కోట్లు, సుల్తానాబాద్ – పెద్దపూర్ రోడ్డుకు రూ.47 కోట్లు, కూనారం – పెద్దపల్లి రోడ్డుకు రూ.14 కోట్లు, జఫర్‌ఖాన్ పేట్ రింగ్ రోడ్డుకు రూ.7 కోట్లు, శ్రీరాంపూర్ హెడ్‌క్వార్టర్ సెంట్రల్ లైటింగ్‌కు రూ.5.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఆగస్టు 17న శంకుస్థాపనలు
ఈ అభివృద్ధి పనులన్నింటికీ ఆగస్టు 17న సుల్తానాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ మండలం నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున సుల్తానాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వర్షాలతో చెరువులు నిండడం శుభపరిణామం
ప్రతిపక్షాలు వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని దొంగ ఏడుపులు ఏడ్చినా.. దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి శ్రీరాంపూర్ మండలంలోని చెరువులన్నీ మత్తళ్లు దుముకుతున్నాయని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత వాతావరణం పత్తి, వరి పంటలకు ఎంతో అనుకూలంగా ఉందని, ఈసారి ఎకరాకు 15 క్వింటాళ్లకు తగ్గకుండా పత్తి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం కోసం త్వరలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పంటపొలాలకు చుక్క సాగునీరు ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉమ్మడి కరీంనగర్ రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని ఈ సందర్భంగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గజానావేనా సదయ్య, స్థానిక సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్, ఎండీ మునీర్, లంక సదయ్య, తుల మనోహర్ రావు, దేవేందర్ రావులతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

