epaper
Friday, January 16, 2026
spot_img
epaper

అందుకు ఒప్పుకుంటేనే భారత్​లో స్టార్​లింక్​ సేవలు!

కలం, వెబ్​డెస్క్​: దేశంలో స్టార్​లింక్​ సహా వివిధ కంపెనీల శాటిలైట్​ ఫోన్ సర్వీసు (Satcom) లకు అనుమతి ఇచ్చే విషయంలో కేంద్రం మరో కీలక మెలిక పెట్టింది. దేశ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే లైసెన్స్​ ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘శాటిలైట్​ ఫోన్​ సర్వీసులకు లైసెన్స్​ ఇచ్చే విషయం రెండు అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి అంతర్జాతీయ గేట్​వేలకు సంబంధించి భారత్​ సూచించిన నిర్దిష్ట భద్రత ప్రమాణాలు పాటించడం, రెండు డేటా కచ్చితంగా ఇండియాలోనే ఉండడం. వీటికి ఒప్పుకుంటేనే స్టార్​లింక్​, ఈయూటెల్​సాట్​, వన్​వెబ్​, జియో ఎస్​జీఎస్​ వంటి శాటిలైట్​ ఫోన్ సర్వీసులకు లైసెన్స్​’ అని సింధియా స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వం శాట్​కామ్​ కంపెనీలకు తాత్కాలికంగా స్పెక్ట్రమ్​ కేటాయించిందని చెప్పిన ఆయన, స్పెక్ట్రం ధరల ఖరారుపై టెలికాం డిపార్ట్​మెంట్​(డీవోటీ), ట్రాయ్​ పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని అన్నారు. మొత్తం మీద భద్రతా అనుమతులు, స్ప్రెక్ట్రమ్​ కేటాయింపు తర్వాతే దేశంలో శాటిలైట్​ కమ్యూనికేషన్​ సేవలు ప్రారంభమవుతాయని సింధియా స్పష్టం చేశారు.

అయితే, శాట్​కామ్​ సేవల (Satcom) కు స్పెక్ట్రమ్​ కేటాయింపుపై డీవోటీ, ట్రాయ్​ మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాట్​కామ్​ సంస్థలపై స్పెక్ట్రమ్​ ఫీజును 4 శాతం బదులు 5 శాతం విధించాని ఈ నెల మొదట్లో డీవోటీ సూచించింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒక్కో కనెక్షన్​పై రూ.500 ఫీజు విధించాలని చెప్పింది. ఈ రెండు ప్రతిపాదనలను ట్రాయ్​ తిరస్కరించింది. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు టెలికాం రంగంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన డిజిటల్​ కమ్యూనికేషన్​ కమిషన్(డీసీసీ)ముందు ఉన్నాయి. అవసరమైతే తుది నిర్ణయం కోసం కేబినెట్​ అనుమతి కూడా తీసుకునే అవకాశం ఉంది. కాగా, డేటా విషయమై ఇప్పటికే ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వినియోగదారుల సమాచారం బయటికి వెళుతోందని ఆరోపణలు ఉన్నాయి. వీటి కారణంగానే.. ఇటీవల ప్రభత్వం ప్రతి మొబైల్​లోనూ సంచార్​ సాథీ యాప్​ను తప్పనిసరి చేయడం, అలాగే లొకేషన్​ ట్రాకింగ్​పై తెచ్చిన నిబంధనలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. దీంతో వీటిపై కేంద్రం వెనక్కి తగ్గింది కూడా. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్రం శాటిలైట్​ ఫోన్​ సర్వీసులకు తెచ్చిన నిబంధనల్లో ఒకటైన డేటా లోకలైజేషన్​ (డేటాను మనదేశంలోనే ఉంచడం)పై సంబంధిత కంపెనీలు అంగీకరిస్తాయా లేదా అనే దానిపై వాటి సేవలు ఆధారపడి ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>