చింతపల్లి అభివృద్ధిపై అధికారులకు ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక ఆదేశాలు

కలం, నల్లగొండ: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, గ్రామాల వారీగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) ఆదేశించారు. నల్గొండ (Nalgonda) జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజలు, రైతుల భూ సమస్యలు, రికార్డుల సవరణ, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ వంటి సేవలను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారుల ప్రధాన బాధ్యత అని అన్నారు.

పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందేలా చూడాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్లు చేపట్టి పంటల సాగులో రైతులను ప్రోత్సహించాలని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనులు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాలని చెప్పారు.

ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామానికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు-సంజీవరెడ్డి, డీఎల్పీఓ, ఎంపీడీవో, తహశీల్దార్, మండల ప్రత్యేక అధికారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>