కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు (Joginapally Srinivas Rao) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శ్రీనివాస్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్వయానా మేనమామ. తన మేనమామ మరణవార్త తెలియడంతో కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ముందుగా నిర్ణయించుకున్న తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అల్వాల్‌లోని వారి నివాసానికి వెళ్లిన కేటీఆర్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు కూడా అల్వాల్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
శ్రీనివాస్ రావు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు యశోద ఆస్పత్రికి బయలుదేరారు. శ్రీనివాస్ రావు మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

