కలం, నిర్మల్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ (Nirmal) నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. గురువారం మామడ మండలం కొరటికల్ గ్రామానికి చెందిన పల్లికొండ పద్మ చిన్నయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు లభించడంతో లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు. ఇల్లు లేని తమ కుటుంబానికి సొంతింటిని నిర్మించి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవితాంతం మర్చిపోలేమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని తమ ఇంట్లో జీవితాంతం ఉంచుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

