కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి ప్రధాన ఆసుపత్రిని (Singareni Hospital) డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కలియతిరిగిన ఆయన, రోగులతో నేరుగా మాట్లాడారు. వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, సర్జికల్ వార్డు, ఐసీయూ, పురుషుల వార్డులతో పాటు ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే, ఇమ్యునైజేషన్ విభాగాలను పరిశీలించారు.
ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ, వైద్య సేవల నాణ్యత, అందుబాటులో ఉన్న వసతులపై సంబంధిత వైద్యాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ప్రసూతి-శిశు సంరక్షణ, శస్త్రచికిత్స విభాగాల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్‌తోపాటు సింగరేణి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

