కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నిషేధిత ఆస్తుల పీఓబీ / 22A జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో 22A/POB అంశంపై (22A and POB Prohibited Lands) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా సబ్‌రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు. 22Aకు సంబంధించి ప్రజావాణితోపాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులుపై సుదీర్ఘంగా చర్చించారు.
కొత్తగా ఏం చేర్చలేదు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. భూముల రెగ్యులరైజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఈనెల 14వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాకోణంలో ఆలోచించాలి..
దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చని, రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్‌లకు స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. ఏది బోగస్ డాక్యుమెంట్, ఏది నిజమైన డాక్యుమెంట్ అనేదానిపై సూపర్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మరింత పారదర్శకత కోసం పహానీలు కూడా చూసేందుకు సబ్ రిజిస్ట్రార్‌కు అనుమతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఏది జెన్యూన్? ఏది కాదు? వంటి వాటిని గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రజా కోణంలో ఆలోచించి కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

