కలం, స్పోర్ట్స్: ప్రపంచ ఫుట్‌బాల్ పాలక సంస్థ ఫిఫాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో(Gianni Infantino) వ్యవహారశైలిపై మూడు ప్రధాన ఫుట్‌బాల్ సమాఖ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఫిఫా వరల్డ్ కప్ భవిష్యత్ లాభాలలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులకు వాటాలు విక్రయించేందుకు ఇన్ఫాంటినో ప్రయత్నించడమే తాజా వివాదానికి ప్రధాన కారణంగా మారింది.
ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యూఈఎఫ్ఏ (UEFA), తన పరిధిలోని 55 సభ్య దేశాలతో ఫిఫా టోర్నీలను బహిష్కరించే స్థాయిలో హెచ్చరికలు చేసినట్లు సమాచారం. మొరాకోలో జరిగిన సమావేశంలో ఇన్ఫాంటినో వ్యవహరించిన తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఫిఫా మేనేజ్‌మెంట్ బోర్డు మాత్రం ఇన్ఫాంటినోకు మద్దతుగా నిలిచింది. వరల్డ్ కప్ భవిష్యత్ ఆదాయాలలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులకు వాటాలు కల్పించే ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు ఫిఫా ప్రకటించినప్పటికీ.. తమ అభ్యంతరాలు మాత్రం తొలగిపోలేదని యూఈఎఫ్ఏ స్పష్టం చేసింది.
మూడు సమాఖ్యల సంయుక్త లేఖ
ఈ నేపథ్యంలో యూఈఎఫ్ఏ(UEFA), కాన్కాకాఫ్ (CONCACAF), ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) సోమవారం సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశాయి. ప్రస్తుత వివాదం కేవలం ఆర్థిక అంశం లేదా గత నిర్ణయాలకు సంబంధించినది కాదని సమాఖ్యలు పేర్కొన్నాయి. తగిన సంప్రదింపులు లేకుండా, సభ్య దేశాలకు నిర్ణయాలను పరిశీలించేందుకు తగిన సమయం ఇవ్వకుండా వేగంగా చర్యలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇన్ఫాంటినో (Gianni Infantino) వ్యవహారశైలి ఫుట్‌బాల్ సమాఖ్యల మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ‘కమ్యూనికేషన్ లోపం’ గా ఫిఫా చిత్రీకరించడాన్ని సమాఖ్యలు ఖండించాయి. ఇది సమాచార లోపం కాదని.. నిర్ణయాధికారంలో వైఫల్యమని విమర్శించాయి.
స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్
మొరాకో సమావేశంలో ఎన్నికైన ప్రతినిధులు తక్కువ సంఖ్యలోనే ఉన్నారని, ఫిఫా కౌన్సిల్ సభ్యులకు సైతం ఆహ్వానం లేదని సమాఖ్యలు పేర్కొన్నాయి. ఫిఫా స్వయంగా నిర్వహించే అంతర్గత సమీక్షపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేస్తూ స్వతంత్ర మూడో పక్షంతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఫిఫా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని తొలగించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది.
అసత్యాలు, అపోహల ఆధారంగా ఫిఫా నాయకత్వాన్ని బలహీనపరచే ప్రయత్నాలు చేయవద్దని సూచించింది. ఇదిలా ఉండగా, ఫిఫా నాయకత్వంపై తాజా వివాదం ప్రపంచ ఫుట్‌బాల్‌లో అధికార వ్యవస్థ, ఆర్థిక నిర్ణయాలు, సభ్య సమాఖ్యలతో సంప్రదింపుల తీరుపై కొత్త చర్చకు దారితీసింది. ఫుట్‌బాల్ అభివృద్ధి, పారదర్శకత, సమాఖ్యల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని అభిమానులు, క్రీడా వర్గాలు కోరుతున్నాయి.
Also Read : షమీకి నో ఛాన్స్.. జహీర్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: Instagram

