కలం వెబ్ డెస్క్ : ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్(Ernakulam Express) రైలులో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనలో రైలులోని రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ వృద్ధుడు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఏపీలోని అనకాపల్లి(Anakapalli)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా బీ1 బోగీలో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. క్రమక్రమంగా బీ1, ఎం2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బోగీల్లో దుప్పట్లు ఉండటం, కిటికీలు మూసి ఉండటంతో వెంటనే మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్ అప్రమత్తమై యలమంచిలి రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశాడు. వెంటనే ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు.
రైల్వే సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కానీ అప్పటికే రెండు భోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి ముందు రైలు నిలిపివేసిన వెంటనే రైలు నుంచి ఇతర కోచ్‌లను వేరుచేశారు. ప్రమాద సమయంలో బీ1 కోచ్‌లో 76 మంది, ఎం2 కోచ్‌లో 82 మంది ప్రయాణికులున్నారు. మంటలను ఆర్పిన తర్వాత డీఎఫ్ఓ రమణ బీ1 కోచ్‌లో ఒక మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 70 ఏళ్ల వయసున్న ఆయన విజయవాడకు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు. ఈ ఒక్క వృద్ధుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి ప్రయాణికులంతా స్టేషన్‌లోనే చలిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి అనకాపల్లికి తరలించారు. ఈ ప్రమాదంతో విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నట్లు అధికారులు ప్రకటించారు. పోలీసులు దీనిపై పూర్తి విచారణ ప్రారంభించారు.
Read Also: 2029లోనూ మోదీనే పీఎం.. కేంద్ర మంత్రి అమిత్ షా
Follow Us On: Instagram


