కలం, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా నర్సంపేటలో (Narsampet BRS Protest) ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల మరణించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహ గద్దె కూల్చడంతో జిల్లా రాజకీయం ఒక్కసారి హీటెక్కింది. ప్రైవేటు స్థలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు.
బీఆర్ఎస్ నేతల అరెస్ట్..
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు బైటాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నీరసన ఉదృతం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకొని అదుపులో తీసుకున్నారు. బీఆర్ఎస్ ధర్నా కారణంగా నర్సంపేట- మహబూబాబాద్, నర్సంపేట-కొత్తగూడ, నర్సంపేట- ములుగు మార్గాల్లో రాకపోకలు నిలిచి పోయాయి.
గద్దె కూల్చివేయడం సరికాదు..
రాత్రివేళ గద్దెను కూల్చివేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మిస్తే రాత్రి సమయంలో కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందనిప్రశ్నించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డిపై అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. గద్దె కూల్చివేత వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
అధికారుల ప్రకటనపై ఆసక్తి..
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెంది కొద్దిరోజులే అయిన నేపథ్యంలో గద్దెను తొలగించడం బాధాకరమని.. అధికారుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే కూల్చివేత జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై మున్సిపల్ అధికారుల ప్రకటనపై ఆసక్తి నెలకొంది.

