కలం, వెబ్ డెస్క్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ (Dammaiguda) లోని శ్రీచైత్యన్య (Sri Chaitanya) హాస్టల్లో దారుణ ఘటన వెలుగుచూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా దాడిచేసిన ఘటన కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి ఇక్కడ పదో తరగతి చదువుతున్నాడు.
రాత్రి సమయంలో దాదాపు 12 మంది సీనియర్ విద్యార్థులు హాస్టల్లో అభిషేక్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, ప్లేట్లతో కొట్టడమే కాకుండా, బూట్లతో ముఖంపై తొక్కుతూ తీవ్రంగా హింసించారు. అయితే తీవ్రంగా గాయపడిని తమ కుమారుడు మెట్ల మీద నుంచి కిందపడిపోయాడంటూ స్కూల్ యాజమాన్యం తమకు ఫోన్ చేసి చెప్పారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.
వెంటనే హాస్టల్‌కు వెళ్లి తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అయితే తాను మాత్రం కిందపడలేదని, సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తనపై దాడిచేశారని అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకొడుకుపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఈ దారుణ ఘటన బయటకు రాకుండా దాచిన స్కూల్ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

