నేటితో ‘సర్’ క్లోజ్.. ఒక్క రోజులో మిగతా 22% పూర్తవుతుందా?

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ (Telangana SIR) ‘ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి’ అన్న తరహాలో జరుగుతున్నది. ఓటర్ల వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటైజ్ చేసే ప్రక్రియకు సోమవారం (ఆగస్టు 10)తో గడువు ముగుస్తున్నది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 78.14% డిజిటైజేషన్ మాత్రమే పూర్తయింది. ఇంకా 21.86% పూర్తి కావాల్సి ఉన్నది. వంద శాతం పూర్తవుతుందనే ఆశలు రాజకీయ పార్టీల్లో సన్నగిల్లాయి. బూత్ లెవల్ ఆఫీసర్లలోనూ ఇదే తరహా మాటలు వినిపిస్తున్నాయి.

‘సర్’ కంప్లీట్ చేయడానికి ఒక రోజు గడువే ఉన్నా బోనాల పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఏ మేరకు పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ 59% లోపే ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 65% దాటలేదు. భువనగిరి జిల్లాలో 94% దాటగా, మహబూబాబాద్‌, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో 90% దాటింది. 22 జిల్లాల్లో 80% దాటగా.. సంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ జిల్లాల్లో 80% లోపే పూర్తయింది.

డిజిటైజ్ కాని ఓటర్ల పేర్లు గల్లంతేనా?

ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లందరికీ ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోలు అందించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. కానీ హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలకు బీఎల్వోలు ఇప్పటికీ రానేలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని చోట్ల బీఎల్వోలు ఇండ్లకు రాకుండా ఎక్కడో ఒక చోట కూర్చుని ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లందరికీ పంపిణీ చేసుకున్నట్లు రికార్డుల్లో రాసుకున్నారు. గడువు ముగిసే సమయానికి ఎంతమంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందో వారి పేర్లతో మాత్రమే ముసాయిదా జాబితాను సీఈవో ఆఫీస్ రూపొందిస్తుంది.

దీన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నది. ఆ తర్వాత నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అనంతరం మార్పులు చేర్పులు అవసరమైతే పూర్తిచేసి తుది జాబితాను అక్టోబరు 19న ప్రకటించనున్నది. ఆ జాబితా ఫైనల్ అవుతుంది. దీంతో రాష్ట్రంలో ఎంత మంది ఓటర్ల పేర్లు ఫైనల్ లిస్టు నుంచి డిలీట్ అయ్యాయనేది నిర్ధారణ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>