కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ.5,403 కోట్లు కేటాయించి, కేవలం రూ.74 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, దీనివల్ల ఇప్పటివరకు ఒక్క నిరుపేదకూ లబ్ధి చేకూరలేదని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రతిభ అవార్డ్స్’ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకానికి బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు అని చూపించినప్పటికీ, పథకం అమలుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. 2024-25 సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధి కింద రూ.33 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే వ్యయం చేశారని మండిపడ్డారు.
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో దళిత విద్యార్థులకు పెద్దపీట వేసి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని , బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్ల కాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.19 వేల కోట్లు విడుదల చేశామని హరీష్ రావు తెలిపారు.

