కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పూణే జిల్లాలోని బారమతి వైమానిక స్థావరం వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం తప్పింది. కార్వర్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఒక ప్రైవేట్ శిక్షణ విమానం (Baramati Aircraft) ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే పైనుంచి పక్కకు జారిపోయింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానానికి స్వల్ప నష్టం మాత్రమే వాటిల్లింది. ప్రమాద సమాచారం అందుకున్న అత్యవసర రెస్క్యూ బృందాలు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాంకేతిక లోపం లేదా యంత్రాల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

