కలం, నాగార్జునసాగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. వ్యవసాయానికి 18 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హాలియా (Haliya) కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు తమ పొలాల వద్ద ఉండే కరెంట్ మోటార్లను ట్రాక్టర్లలో తెచ్చి, నేషనల్ హైవే 167 పై రహదారికి అడ్డంగా ఉంచి బైఠాయించారు. దీంతో హైదరాబాద్ – నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (Nomula Bhagath) మాట్లాడుతూ.. గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను మోసగించడం జరిగిందని అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాశీ వెళ్లి గంగా నదిలో పుణ్య స్నానం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వచ్చి వర్షం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే వరుణ యాగంలో పాల్గొనాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దేవులపై నమ్మకం ఉందని.. అందుకే కాంగ్రెస్ పార్టీ వర్షం కోసం చేస్తున్న యాగాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటలు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇచ్చే కరెంటులో కూడా 6 గంటలకు 6 గంటలకు మధ్య బ్రేక్ పెడుతున్నారని, దీనివల్ల రైతులకు మడి కూడా తడవని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కాళేశ్వరం పంపులను ఆన్ చేయకుండా రాజకీయ కక్ష సాధింపు పాల్పడుతూ రైతులను బలి చేస్తున్నారని మండిపడ్డారు.
మిగులు జలాల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్రకు అప్పనంగా అందజేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి గోదావరి జిల్లాలను ఎత్తిపోస్తే తెలంగాణలో సగభాగం సస్యశ్యామలవుతుందన్నారు. గోదావరిలో నీళ్లు ఉన్న కూడా ముఖ్యమంత్రి కరెంట్ ఇవ్వకపోవడం వల్లనే రాష్ట్రంలో రైతులు దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ – నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ చేసిన రాస్తారోకో వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలకడంతో విద్యుత్ శాఖ అధికారి ఆ చోటుకు వచ్చారు. అనంతరం వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : థాయిలాండ్‌లో నిజామాబాద్ క్రీడాకారుల జోరు
Follow Us On : WhatsApp

