ప్రభుత్వ తప్పులకు అధికారులపై కేసులు.. సందీప్ సుల్తానియాపై ఫైర్

కలం, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం చేస్తున్న తప్పుల కారణంగా ఉన్నతాధికారులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తున్నదని, వారిపై కోర్టు ధిక్కరణ పిటిషన్లూ దాఖలవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆఫీసర్లను, బ్యూరోక్రాట్లను హైకోర్టుకు పిలిపించడం బాధగానే ఉన్నా తప్పడం లేదని, వారు ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములని పేర్కొంది. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ సర్చార్జి బకాయిలు దాదాపు రూ.33 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై బోర్డు సభ్యుడు రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ‘కోర్టు ధిక్కరణ’ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ భీమపాక నగేశ్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

విచారణకు హాజరైన సందీప్ సుల్తానియా

కేసుపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ గత నెల 10న జరిగినప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా హాజరుకానందున హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని, ఒకవేళ ఆయనే హాజరవుతానని హామీ ఇస్తే రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. దానికి కొనసాగింపుగా సందీప్ కుమార్ శుక్రవారం హైకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు.

జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది

ప్రభుత్వంలో కీలక విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ బ్యూరోక్రాట్లను హైకోర్టుకు పిలిపించడం బాధగానే ఉందని, కానీ తప్పడం లేదని జస్టిస్ నగేశ్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ పై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, ఆ పిటిషన్లపై విచారణ జరిపి శిక్ష విధిస్తే ఆయన జీవితకాలమంతా జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుబంధు, రైతుభరోసా లాంటి పథకాలు చాలా మంచివని, కానీ లబ్ధిదారుల్లో కోటీశ్వరులు కూడా ఉండటం సమంజసం కాదన్నారు.

అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాల్సి ఉన్నప్పటికీ, ఎంతో మంది అనర్హులు ఉచిత పథకాలు పొందుతున్నారని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ బోర్డుకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇస్తూ, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టుకు ఈ నెల19కి వాయిదా వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>