ట్రిపుల్ ఆర్‌ నార్త్ టెండర్లు.. మ‌ళ్లీ గ‌డువు పొడిగింపు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఇంకా టెండర్ల చుట్టూనే తిరుగుతున్నది. కేంద్రం నుంచి అనుమతులు, టెండర్ నోటిఫికేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మొత్తం 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డులో సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – యాదాద్రి – భువనగిరి – చౌటుప్పల్ కలుపుతూ ఉత్తర భాగం, చౌటుప్పల్ – ఇబ్రహీంపట్నం – ఆమన్‌గల్ – చేవెళ్ల – శంకర్‌పల్లి – సంగారెడ్డి కలిపి దక్షిణ భాగంగా ఉన్నాయి. ఉత్తర భాగానికి ఇప్పటికే భూసేకరణ, డీపీఆర్, కేంద్ర అనుమతులు వేగంగా పూర్తయ్యాయి.

నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ గతేడాది నవంబర్‌‌లోనే మొదలైంది. సుమారు రూ.8,535 కోట్ల అంచనా వ్యయంగా ఆర్‌‌అండ్‌బీ పేర్కొన్నది. అయితే టెండర్ దాఖలు గడువును నేషనల్ హైవేస్ అథారిటీ ఇప్పటికే ఐదుసార్లు పొడిగించింది. ఈ ఏడాది ఏప్రిల్‌, మేలో రెండుసార్లు చొప్పున, ఈ నెలలో ఒకసారి పొడిగించింది. ఇప్పుడు తాజాగా మరోసారి పొడిగించడంతో మొత్తం ఆరుసార్లు ఎక్స్‌టెండ్‌ చేసినట్టయింది. టెండర్ డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి ఈ నెల 20 వరకు అవకాశం కల్పించింది.

గడువులతో కాలక్షేపం

ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం టెండర్ల (RRR North Tender) ప్రక్రియ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ ఉన్నది. గతేడాది నవంబర్ 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 29తో డెడ్‌లైన్ ముగిసింది. ఆ తర్వాత ఐదుసార్లు పొడిగించిన హైవేస్ అథారిటీ.. తాజాగా ఆగస్టు 20 వరకు అవకాశం కల్పించింది. ఇదే చివరి డెడ్‌లైన్‌గా ఉంటుందా? లేక మరికొన్ని పొడిగింపులు ఉంటాయా? ప్రాజెక్టు నిర్మాణ దశలోకి అడుగుపెడుతుందా? లేక మరోసారి ప్రక్రియ నత్తనడకనే కొనసాగుతుందా?.. ఇలాంటి అనుమానాలు రోడ్లు భవనాల శాఖ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో కొన్ని షరతులపై స్పష్టత కోరడం, భారీ విలువ కలిగిన ప్రాజెక్టు కావడంతో కన్సార్టియంల ఏర్పాటుకు అదనపు సమయం అవసరం కావడం, టెక్నికల్ అర్హతలు, ఆర్థిక అర్హతలపై బిడ్డర్లలో సందేహాలు నెలకొనడం, కొన్ని ప్రీ-బిడ్ క్లారిఫికేషన్ల తర్వాత షెడ్యూల్‌లో సవరణలు జరగడం.. ఇలాంటివి తరచూ టెండర్ డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ కావడానికి కారణాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రం, రాష్ట్రానికి భిన్నాభిప్రాయాలు

రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ ఉత్తర, దక్షిణ భాగాలను ఒకేసారి చేపట్టాలని కోరుతున్నది. ట్రిపుల్ ఆర్ సంగారెడ్డి నుంచి మొదలై హైదరాబాద్ సిటీ ఉత్తర, దక్షిణ భాగాలను చుట్టి తిరిగి సంగారెడ్డి దగ్గరకే వస్తే.. అది పూర్తిస్థాయి రీజినల్ రింగు రోడ్డుగా ఉంటుందని వివరించింది. కేవలం ఉత్తర భాగం మాత్రమే పూర్తిచేస్తే అది సగం రింగుగానే ఉంటుందని, దక్షిణ భాగం కంప్లీట్ అయ్యేంత వరకు నిష్ప్రయోజనంగా మిగిలిపోతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. రవాణా, పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఉపగ్రహ పట్టణాల అభివృద్ధి వంటి లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరవని కేంద్రానికి పలుమార్లు విన్నవించింది. అయితే టెక్నికల్‌గా అన్ని ఆటంకాలను అధిగమించి సిద్ధంగా ఉన్న ఉత్తర భాగాన్ని ముందుగా అమలు చేయడమే సమంజసం అనేది కేంద్ర ప్రభుత్వ, నేషనల్ హైవేస్ అథారిటీ వాదన. ట్రిపుల్ ఆర్ ప్లానింగ్‌లో తొలుత కేంద్ర ప్రభుత్వ అనుమతులు, డీపీఆర్, ఆర్థిక ఆమోదాలకు సమయం పట్టగా.. ఇప్పుడు టెండర్ ప్రక్రియలో డెడ్‌లైన్ పొడిగింపు ఇబ్బందికరంగా మారింది.

ఐదేండ్లుగా సాగుతున్న ప్రాజెక్టు

= కేంద్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును 2021 మార్చి 5న ఆమోదించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
= మొత్తం ఐదు ప్యాకేజీల్లో నిర్మించేలా రూ.8,535 కోట్లుగా వ్యయం అంచనా వేసింది. తొలుత యాక్సెస్ ఎక్స్ ప్రెస్ హైవేగా నిర్మించి గంటకు 130 కిలోమీటర్ల వేగం ఉండేలా ఆలోచించింది. ఆ తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో స్టాండర్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా ఖరారు చేసింది.
= హ్యామ్ పద్ధతిలో నిర్మించాలని, అవసరమైన భూసేకరణలో 50% ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం భావించింది. ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,525 కోట్లను కేటాయించింది.
= పలుమార్లు ఉత్తర, దక్షిణ పార్టుల్లో అలైన్‌మెంట్ మార్పులు, హెచ్ఎండీఏ ఎక్స్‌టెండెడ్ పార్టును ఇందులో భాగం చేయడం, ఈ మార్పుతో కొత్త డీపీఆర్ తయారీ.. ఇలాంటి అంశాలతో కొలిక్కి రాలేదు.
= టెండర్ ప్రక్రియ పూర్తయితే నిర్మాణం మొదలవుతుందని రాష్ట్ర సర్కార్ ఆశలు పెట్టుకున్నా టెండర్ల దాఖలుకు గడువు పొడిగిస్తూ ఉండడం గమనార్హం.

సదరన్ పార్ట్ వయా ఫ్యూచర్ సిటీ

ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్కులు అభివృద్ధి చెందితే దక్షిణ భాగం కనెక్టివిటీ లేకపోతే పూర్తిస్థాయిలో ప్రయోజనం నెరవేరదన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. కంప్లీట్ రింగ్ రోడ్డు వినియోగంలో ఎంత ఆలస్యమైతే ప్రాంతీయ అసమానతలు అంతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా కేంద్రానికి గతంలోనే వివరించింది. హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం కంప్లీట్ కాకపోతే ఆశించిన ఫలితం ఇవ్వదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫార్మా, లాజిస్టిక్స్, కొత్త పారిశ్రామిక కారిడార్లు.. ఇలాంటివి దక్షిణం వైపు విస్తరిస్తున్న తరుణంలో పూర్తి రింగ్ రోడ్ అవసరమని కేంద్రానికి స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>