తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. నేటి నుంచే..

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో చేయూత పింఛన్ (Telangana Pension) లబ్దిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న కొత్త పింఛన్లను అమలు చేసేందుకు నిర్ణయించింది. రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుక (ఆగస్టు 15) నుంచే కొత్త ఫించన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నుంచి (ఆగస్టు 8) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అప్లై చేయండిలా..

దీనికోసం అర్హులు శనివారం నుంచే తమ అప్లికేషన్లు సమర్పించాలని సూచించింది. అయితే దరఖాస్తులకు ఎలాంటి చివరి తేదీ లేదని.. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని.. అధికారుల వద్ద ఒకసారి నిర్ధారించుకుంటే సరిపోతుందని తెలిపింది. కొత్తగా ఫించన్ కు అప్లై చేసేవారు చేయూత వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సమీప ఇంటర్నెట్ సెంటర్ లలో సైతం ఫామ్ లు అందుబాటులో ఉంటాయి. దానిని నింపిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు/ మండల ప్రజా పరిషత్ ఆఫిసుల్లో సమర్పించాలని తెలిపింది. ఇక పట్టణాల్లో బిల్ కలెక్టర్లు / వార్డు అధికారులు / పురపాలక కమిషనర్లకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

కొత్త పింఛన్లకు ఎవరు అర్హులు?

చేయూత పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు నిర్దేశించింది. గ్రామాల్లో రూ.లక్షా 50 వేలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న వారు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఎక్కువ ఆదాయం ఉన్నవారు అంటే.. మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్న వారు పింఛన్ పొందలేరని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వ లేదా ఫ్రీడమ్ ఫైటర్ పింఛన్​ పొందుతున్న వారు, 4 వీలర్ / భారీ వాహనాలు ఉన్న వారు పింఛన్‌ పొందేందుకు అనర్హులుగా పేర్కొంది. అలాగే ప్రభుత్వ రంగ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు ఉన్నవారిని అనర్హులుగా తేల్చి చెప్పింది.

లబ్దిదారులకు ఇవి తప్పనిసరి!

•వితంతు ఫించన్ లబ్ధిదారులకు భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి.
•భర్తతో విడిపోయిన, విడాకులు పొందిన వారు కనీసం ఏడాదిగా విడిగా ఉంటున్నట్లు ఎమ్మార్వో విచారణ నివేదిక ఇవ్వాలి.
•పెళ్లికాని మహిళలకు 30-35ఏళ్లు ఉండాలి.
•దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌లో 40%పైగా వైకల్యం ఉండాలి.
•50ఏళ్లు పైబడిన చేనేత, గీత కార్మికులు సొసైటీ సభ్యత్వం, సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>