కలం, నిర్మల్: గుడుంబా, గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ నిర్మల్ జిల్లా (Nirmal) ఖానాపూర్ మండలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి శుక్రవారం తెలిపారు. తర్లపాడ్ ఖానాపూర్ మార్గంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
అలాగే ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్‌లో అల్లెపు శైలజ వద్ద 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గతంలో నమోదైన గుడుంబా కేసుల్లో నిందితులైన ఆరుగురిని తహసీల్దార్ సుజాత ఎదుట బైండోవర్ చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు వసంతరావు, అభిషేక్ సిబ్బంది పాల్గొన్నారు.

