కలం, నాగార్జునసాగర్: తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన కృష్ణమ్మ ఒడ్డున నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వేదికగా ప్రతిష్ఠాత్మక వరుణ యాగం (Varuna Yagam) నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 10న విజయవిహార్ ప్రాంగణంలో జరిగే ఈ మహాయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది వేద పండితులు, 11 హోమగుండాల మధ్య శాస్త్రోక్తంగా వరుణ యాగం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజయవిహార్‌లోని యాగస్థలిని స్వయంగా పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్.. యాగశాల నిర్మాణం, వేద పండితులు, ఋత్వికులు, అర్చకులకు ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. యాగశాల వద్ద భారీ బారికేడ్లు, పగోడాలు, ప్రవచనశాల, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు తగిన సీటింగ్ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. విజయవిహార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పోలీసు శాఖ సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించి పూర్తి కార్యాచరణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ రమేష్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, యాదాద్రి దేవస్థానం డిప్యూటీ ఈవో డి. భాస్కర్, జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కే. భాస్కర్, డీఎస్పీ రవి, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, విజయపురి సీఐ శీను నాయక్, ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

