కలం, దమ్మపేట: కోలాటాల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని (Aswaraopeta) శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ భక్తులు గుర్రాలచెరువు స్వయంభూ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ సారెను (Ashada Sare Ceremony) వైభవంగా సమర్పించారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ శైవ, వైష్ణవ, శాక్తేయ భక్తులు ఏకమై శుక్రవారం మహా సారె కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి 108 రకాల మిఠాయిలు, 27 రకాల పండ్లు, పట్టుచీర, గాజులు, పసుపు-కుంకుమ, చలిమిడి తదితర మంగళ ద్రవ్యాలను సమర్పించారు. లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ సాయి సేవకులు, మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ఆషాఢ సారె వేడుక భక్తులను ఆకట్టుకుంది.
Also Read : బస్సు తుస్సు.. మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు, ప్రయాణికులకు చుక్కలే!
Follow Us On : WhatsApp

