కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వెటర్నరీ సబ్ సెంటర్ భవనానికి, 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి (Ponnam Prabhakar) మాట్లాడారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో స్థానిక మహిళలు, ప్రజాప్రతినిధుల ఆమోదంతోనే వివో భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. మిగిలిన వివో సంఘాలకు త్వరలోనే స్వంత భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ పవర్, ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి పథకాల ద్వారా తోడ్పాటునందిస్తున్నామని స్పష్టం చేశారు.
హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న రోడ్ల అనుసంధానం, 29 బ్రిడ్జీల నిర్మాణం కోసం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇందుర్తి, ములకనూరు బ్రిడ్జి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, కరీంనగర్ మార్గాన్ని ఫోర్ లేన్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
Also Read : ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
Follow Us On : WhatsApp

