కలం, నాగార్జునసాగర్ : రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళతో కళకళలాడాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 10వ తేదీన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) జలాశయం ఒడ్డున ఉన్న విజయ విహార్ ఆవరణలో మహా వరుణ యాగం (Maha Varuna Yagam) నిర్వహించనుంది. ఈ యాగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొననున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణ యాగం (Varuna Yagam) జరగనుంది. నూతన దేవస్థాన బోర్డు ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న తొలి యాగం కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న మొదటి వరుణ యాగం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించిన ప్రభుత్వం, ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది.
యాగ నిర్వహణ కోసం విజయ విహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలను సిద్ధం చేస్తున్నారు. వేద పండితులు, అర్చక బృందంతో పాటు మొత్తం 108 మంది ప్రముఖ ఋత్వికులు ఈ మహా క్రతువులో పాల్గొని మంత్రోచ్ఛారణలు చేయనున్నారు. ఆగస్టు 10వ తేదీన సాయంత్రం 3.20 గంటల నుండి 3.24 గంటల మధ్య శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో యాగ పూర్ణాహుతి జరగనుంది.
రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్నప్పటికీ, శ్రీశైలం నుంచి ఇంకా తగినంత ప్రవాహం రాకపోవడంతో నాగార్జున సాగర్ ప్రస్తుతం డెడ్ స్టోరేజ్లోనే ఉండిపోయింది. శ్రీశైలం నిండటానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద దాదాపు 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నందున, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో ప్రభావం పూర్తిస్థాయిలో తొలగిపోయి వర్షాలు కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : ఈ రోజే తేలాలి.. డివోర్స్పై పట్టుబట్టిన విజయ్ భార్య!
Follow Us On : WhatsApp

