కలం, వెబ్‌డెస్క్: ఒక వైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు అసెంబ్లీ సమావేశాలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly)లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే క్వశ్చన్ అవర్ లేకపోవడంపై బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సెక్షన్ 280 కింద జరిగిన చర్చ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే జర్‌నైల్ సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నిబంధన కేవలం నియోజకవర్గ సమస్యలను లేవనెత్తడానికి మాత్రమే అనుమతిస్తుందని, ప్రభుత్వ సమాధానాన్ని కోరే అవకాశం ఇవ్వదని ఆయన ఆరోపించారు.
ఈ విమర్శలపై స్పందించిన పర్యాటక మంత్రి కపిల్ మిశ్రా, గత ఆప్ ప్రభుత్వమే క్రమం తప్పకుండా ప్రశ్నోత్తరాలను నిర్వహించడంలో విఫలమైందని తిప్పికొట్టారు. 2022 మార్చి తర్వాత, 2023 గానీ, 2024లో గానీ ఎలాంటి క్వశ్చన్ అవర్ జరగలేదని ఆయన ఆరోపించారు. తాము ఎన్నికల హామీలను అమలు చేస్తుండటం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి పర్వేశ్ వర్మ విమర్శించారు.
ఆప్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ 74 సార్లు సమావేశమైందని, ఇందులో కేవలం 9 సార్లు మాత్రమే ప్రశ్నోత్తరాలు నిర్వహించారని పర్వేశ్ వర్మ గుర్తు చేశారు. ఈ పరిణామాల మధ్య ఇరు పార్టీల సభ్యుల పరస్పర ఆరోపణలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆప్ ఎమ్మెల్యే కుల్‌దీప్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే రవి నేగి తమ తమ స్థానాల నుంచి లేచి సభలో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతర సభ్యులు జోక్యం చేసుకొని వారిద్దరినీ సముదాయించారు. ప్రతిపక్ష నేత అతిషి సభకు హాజరుకాకపోవడంపై కూడా సభలో చర్చ జరిగింది.
Also Read : ఈ రోజే తేలాలి.. డివోర్స్‌పై పట్టుబట్టిన విజయ్ భార్య!
Follow Us On: Instagram

