మిట్టె జలపాతం.. ప్రకృతి ఒడిలో భూతల స్వర్గం!

కలం, ఆదిలాబాద్‌ బ్యూరో : అందాల జలపాతం ఆకాశం నుండి జాలువారుతోందా అన్నట్లుగా.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని మిట్టె జలపాతం (Mitte Waterfalls) అందాలు కన్నులపండువగా మారాయి. ఆకాశం నుండి జాలువారుతున్న నీటి బిందువులు, పాలధారల్లా రాతి శిలలపై పరవళ్లు తొక్కుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. నీటి జలసవ్వడులు సంగీత రాగాలు పలికిస్తూ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ జలపాతాల అందాలను తిలకించిన పర్యాటకులు ‘భువికి దిగివచ్చిన స్వర్గసీమ’ అని మురిసిపోతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న మిట్టే జలపాతం అందాలపై ప్రత్యేక కథనం.

సప్తగుండాలు..

కుమ్రంభీమ్ జిల్లా లింగపూర్ మండలం పిట్టగూడ సమీపంలోని దట్టమైన అడవిలో ఈ అందమైన మిట్టె జలపాతం (Mitte Waterfalls) ఉంది. సాధారణంగా ఒక ప్రాంతంలో ఒకే జలపాతం ఉంటుంది. కానీ, ఈ ప్రాంతంలో ఏడు వరుస జలపాతాలు ఉన్నాయి. ఈ ఏడు జలపాతాల భూతల స్వర్గాన్ని స్థానిక ఆదివాసీలు ‘సప్తగుండాలు’ అని పిలుస్తారు.

పాలధారలను తలపించే నీటి ధారలు, కొండల మధ్య పరవళ్లు తొక్కే దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక చోట జలపాతం బల్లపరుపుగా ప్రవహిస్తుంటే, ఆ జలధారలు ఆకాశం నుంచే నేరుగా పడుతున్నాయా అనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు జలపాతాల కింద కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు. ఈ అద్భుత క్షణాలను తమ ఫోన్లలో సెల్ఫీలు, ఫొటోలు తీస్తూ ఆనందంతో మైమరిచిపోతున్నారు.

వంద మీటర్ల ఎత్తు నుంచి ప్రవహించే బాహుబలి జలపాతం..

ఈ జలపాతం నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మరొక జలపాతం దర్శనమిస్తుంది. అటు నుండి ఇంకా కాస్త ముందుకు సాగితే అద్భుతమైన ‘బాహుబలి జలపాతం’ కనిపిస్తుంది. ఈ బాహుబలి జలపాతం సుమారు వంద మీటర్ల ఎత్తు నుంచి లోతైన లోయలోకి ప్రవహిస్తుంది. లోయలోని రాతి శిలలపై పడుతూ, లేస్తూ ప్రవహించే నీటి హోరు సంగీతాన్ని తలపిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు.

కానీ సరైన రహదారి కరువు..

లోతైన లోయలలో పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తూ సాహస యాత్రను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి రాతి శిలల అందాలు ఆఫ్రికా ఖండంలో ఉండే రాతి నిర్మాణాలను పోలి ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, చెట్లకు అల్లుకున్న తీగజాతి మొక్కలు ప్రకృతి పందిరి వేసినట్లుగా ఉన్నాయి. అయితే, ఈ సుందరమైన ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇక్కడ తగిన వసతులు, రహదారి సౌకర్యం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>