తెలంగాణ ‘ఎనర్జీ సెక్యూరిటీ’లో కొత్త అధ్యాయం

కలం, తెలంగాణ బ్యూరో: స్టేట్ ఎనర్జీ సెక్యూరిటీ, సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దశాబ్ద కాలంగా కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని ‘నైనీ’ కోల్ బ్లాక్ నుంచి ఫస్ట్ లోడ్ గురువారం తెలంగాణ చేరుకున్నది. అనేక ఆటంకాలను అధిగమించిన సింగరేణి సంస్థ ఎట్టకేలకు నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి గూడ్స్ రైల్ ద్వారా తెలంగాణకు పంపించింది. సుమారు 1,130 కి.మీ. మేర 59 వ్యాగన్లతో ప్రయాణించిన గూడ్స్ రైల్ మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)కు గురువారం ఉదయం చేరుకున్నది.

ఇతర రాష్ట్రంలో ఉన్న సొంత గని నుంచి తెలంగాణకు బొగ్గు తరలించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో సంస్థలోనే కాకుండా రాష్ట్ర ఇంధన రంగంలోనూ ఇది ఒక మైలురాయిగా నిలిచింది. సుమారు 4 వేల టన్నుల అత్యుత్తమ ‘జీ-10’ గ్రేడ్ బొగ్గు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి వినియోగం కానునున్నది. భవిష్యత్ ఇంధన భద్రతకు ఇది బలమైన పునాది అవుతుందన్నది సింగరేణి అధికారుల భావన. ఈ సక్సెస్‌‌పై అమెరికాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంతృప్తి వ్యక్తం చేశారు.

ఘన స్వాగతం

మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే వ్యాగన్లకు సంస్థ డైరెక్టర్లు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం కోల్ యార్డులో బొగ్గు అన్‌లోడింగ్‌ ప్రారంభమైంది. ఇతర రాష్ట్రంలోని తన సొంత గని నుంచి తెలంగాణకు బొగ్గు తరలించడం సంస్థ చరిత్రలో అరుదైన ఘట్టమని, ఇది సింగరేణి విస్తరణకు కొత్త దిశను చూపుతుందని అధికారులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక..!

నైనీ బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 13న సింగరేణికి కేటాయించింది. కానీ, మైనింగ్ యాక్టివిటీస్ మాత్రం మొదలుకాలేదు. బొగ్గు నిల్వలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇది అత్యంత కీలకమైన బ్లాక్‌ అని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి అప్పుడే గుర్తించాయి. మైనింగ్ కార్యకలాపాలకు తగిన అనుమతులు రాకపోవడంతో ఇంతకాలం ప్రక్రియ మొదలుకాలేదు. ఇప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చొరవ లేకపోవడం, సంబంధిత శాఖల సమన్వయం లేకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు తాను, సింగరేణి అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, కేంద్ర సంస్థలతో చర్చలు, అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టితో సాకారమైందని పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రెండుసార్లు ఒడిశా పర్యటించి అక్కడి ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేవారు. ఈ ప్రక్రియ వేగం పుంజుకుని ఈ ఏడాది ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందని, ఇప్పుడు తొలి బొగ్గు లోడ్ తెలంగాణకు చేరుకోవడం ఆ కృషికి ప్రత్యక్ష ఫలితమని అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలకు సరిపోయే బొగ్గు

నైనీ గని కేవలం సింగరేణికి ఉన్న బొగ్గు గనులకు అదనంగా చేరినది కాదని, రాబోయే మూడు దశాబ్దాలకు పైగా తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చగల వ్యూహాత్మక ఆస్తి అని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు. సుమారు 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఈ గనిలో ఉన్నాయని, సంవత్సరానికి కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, దాదాపు 36 సంవత్సరాలపాటు మైనింగ్ చేసుకోచవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ లభించే జీ-10 గ్రేడ్ బొగ్గు అధిక నాణ్యత కలిగి ఉండటంతో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యం పెరగడమే కాకుండా, ఇంధన వ్యయాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఇప్పటిదాకా తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గులో కొంత భాగం ఇతర వనరులపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు నైనీ నుంచి నేరుగా సరఫరా అవుతుందని, భవిష్యత్‌ ఇంధన సరఫరా మరింత స్థిరపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలోని బొగ్గు గనులకే పరిమితమైన సింగరేణి కార్యకలాపాలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. సంప్రదాయ బొగ్గు తవ్వకాలతో పాటు క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగాల్లోకి కూడా సింగరేణి విస్తరించాలన్న దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.

భట్టి విక్రమార్క వీడియో సందేశం

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో సందేశం ద్వారా సింగరేణి యాజమాన్యాన్ని, కార్మికులను అభినందించారు. నైనీ నుంచి తొలి బొగ్గు రాక సింగరేణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా మరిన్ని బొగ్గు బ్లాకులను సాధించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నదన్నారు. భవిష్యత్‌లో సింగరేణి కేవలం బొగ్గు సంస్థగానే కాకుండా ప్రపంచ స్థాయి మైనింగ్ కంపెనీగా ఎదగాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>