కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌ను ఆధునిక, ప్రణాళికాబద్ధమైన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) హైదరాబాద్‌లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయాల్లో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మొదట మున్సిపల్ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ టికె శ్రీదేవితో సమావేశమయ్యారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇంజినీర్-ఇన్-చీఫ్ తదితర ఉన్నతాధికారులను కలిసి నగర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
పలు అంశాల ప్రస్తావన..
ఈ సమావేశాల్లో మేయర్ శ్రీనివాస్ నగరంలోని రోడ్లకు ప్యాచ్ వర్క్, తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు అప్రోచ్ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం, విలీన గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి అంశాలపై చర్చించారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్లైన్లు, వీధి దీపాలు, పారిశుధ్య వసతులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణ చర్యలు, స్మార్ట్ సిటీ, యూఐడీఎఫ్ పనులను వేగవంతం చేయడం, ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ సుందరీకరణ వంటి అంశాలను ప్రస్తావించారు.
ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీలు..
టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని మేయర్ శ్రీనివాస్ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిని కోరారు. నగర విస్తరణను దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డీటీసీపీ అధికారులను కోరారు. ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ తదితర ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లారు.
నగరాన్ని ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని మేయర్ శ్రీనివాస్ కోరారు. ప్రతిపాదనలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్వీకరించిన అధికారులు, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రాధాన్యతా పనులను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

