ఖమ్మం కార్పొరేషన్‌పై బీఆర్ఎస్ పోరు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) మున్సిపల్ కార్పొరేషన్‌లో (Municipal Corporation) అధికార కాంగ్రెస్ నాయకులు, అధికారుల కుమ్మక్కుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆరోపించింది. కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు, పారిశుద్ధ్య వైఫల్యాలు, పౌర సమస్యలపై నిరసనగా గురువారం బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కర్ణాటి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందని విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పేరుతో కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేషన్ వాహనాల డీజిల్ వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బ్రేక్‌డౌన్ అయిన వాహనాల పేర్లతో డీజిల్ నమోదు చేసి దుర్వినియోగం చేస్తున్నారని, ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో క్రిమినల్ విచారణ చేపట్టాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రజా సౌకర్యాల నిర్వహణలో పారదర్శకత లేకుండా పోయిందని ఆరోపించారు.

నగరంలో డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, పార్కుల నిర్వహణ అధ్వానంగా మారిందని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోకపోతే నగర ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమర్, బి.రెడ్డి నాగచంద్రారెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>