మహిళలు, బాలికల భద్రతపై పోలీసుల అవగాహన

కలం, యాదగిరిగుట్ట: మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు (Yadadri Police) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు పట్టణ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ప్రజలకు భద్రతా సూచనలు అందించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు.. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ప్రయాణించే సమయంలో ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులకు తెలియజేయాలని, రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ప్రతి మహిళ స్వీయ రక్షణ (Self Defense) పద్ధతులను నేర్చుకోవాలని, అత్యవసర ఫోన్ నంబర్లను మొబైల్‌లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వేధింపులు, హింస లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు  సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని పోలీసులు సూచించారు.

చిన్నారుల భద్రతపై అవగాహన

చిన్నారులకు మంచి స్పర్శ (Good Touch), చెడు స్పర్శ (Bad Touch)పై అవగాహన కల్పించారు. ఏదైనా అసౌకర్యం లేదా భయం కలిగితే వెంటనే తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పాలని సూచించారు. అపరిచితులతో వెళ్లకూడదని, వారి నుంచి బహుమతులు లేదా ఆహార పదార్థాలు తీసుకోకూడదని పిల్లలకు కుటుంబ సభ్యులు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు యాదయ్య, ఖాజా మొయినుద్దీన్, ఇంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>