మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత : సుధారాణి

కలం, వనపర్తి: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి (Wanaparthy) జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి జడ్పీ సీఈవో యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా వల్ల మహిళలు, బాలికలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, విదేశీ ఉపాధి, విద్య పేరుతో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేయడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని వల వేయడం, నకిలీ వివాహాలు, చిన్నారులను ప్రలోభపెట్టడం లేదా అపహరించడం వంటి మార్గాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని వివరించారు.

ఇలాంటి ముఠాల బారిన పడితే వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం, శారీరక–మానసిక హింసకు గురికావడం, చదువు, భవిష్యత్తు దెబ్బతినడం, కుటుంబాలకు దూరమవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పంచుకోవద్దని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. అనంతరం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మోసపు ఉచ్చులో చిక్కుకున్న బాధితులు అత్యవసర సహాయం కోసం 112 (పోలీసు అత్యవసర సేవలు), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1098 (బాలల హెల్ప్‌లైన్) నంబర్లను సంప్రదించాలని సూచించారు.

కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్‌ఐ అమ్జద్, జీసీడీఓ, ఏఎస్‌ఓ, సీడీపీఓలు, ఆర్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, డీహెచ్‌ఈడబ్ల్యూ స్టాఫ్, సఖి టీమ్, షీ టీమ్, భరోసా టీమ్, ఐసీపీఎస్ టీమ్, మహిళా పోలీసులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>