కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా తెల్లాపూర్ (Tellapur) మున్సిపాలిటీ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్లేస్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడు చెరువు (Lake) లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తెల్లాపూర్ చెరువు పక్కనే ఉన్న శిఖరం ప్లేస్కూల్‌లో షణ్ముక్ (6) అనే బాలుడిని గురువారం ఉదయం తండ్రి ఉదయ్ కిరణ్ దించి వెళ్లారు. పాఠశాల ప్రాంగణంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో, హడావుడిలో బాలుడు షణ్ముక్ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. స్కూల్ పక్కనే ఉన్న తెల్లాపూర్ చెరువు సమీపానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.
షణ్ముక్ కనిపించకపోవడంతో గమనించిన నిర్వాహకులు వెతకడం ప్రారంభించగా.. చెరువులో బాలుడు శవమై తేలాడు. పాఠశాల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చెరువులోంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

