కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (Prof Kothapalli Jayashankar) 92వ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఆకాంక్షించినప్పటికీ, ఆ కల నెరవేరకముందే ఆయన కన్నుమూశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పితామహుడిగా పేరుగాంచిన జయశంకర్ ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

