కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలన్నింటికీ లామినేటెడ్ రేషను కార్డులను (New Ration Cards) అందించనున్నది. రాష్ట్రంలోని సుమారు 1.05 కోట్ల మందికి ఈ కార్డులు అందనున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల పరిధిలో ఈ పంపిణీ ప్రక్రియ అమల్లోకి రానున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంద్రాగస్టు రోజున సంగారెడ్డిలో కొత్త రేషను కార్డుల పంపిణీ ప్ర్రక్రియ లాంఛనంగా ప్రారంభం కానున్నది. అదే రోజున అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ పంపిణీ కొనసాగనున్నది. పేద కుటుంబాల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడున్న రేషను కార్డుల స్థానంలో లామినేటెడ్ (స్మార్టు కార్డుల తరహా) కార్డులను అందించనున్నట్లు తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
నియోజకవర్గాల్లో ఆర్డీవోల ఆధ్వర్యంలో పంపిణీ
ఈ కొత్త కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ప్రారంభమవుతుందని, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్డీవో (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు) పంపిణీ చేస్తారని మంత్రి ఉత్తమ్ ఆ ప్రకటనలో వివరించారు. ఆగస్టు 15న ఉదయం జెండా వందనం కార్యక్రమాలుంటున్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లాంటి అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గాల్లో జరిగే రేషను కార్డుల డిస్ట్రిబ్యూషన్‌కు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

