కలం, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీకి (TDP) కార్యకర్తలు ప్రత్యేక బలం. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల బలం టీడీపీకి ఉంటుంది. ఎన్నికల సయమంలో పోల్ మేనేజ్‌మెంట్ చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకం. ఇక టీడీపీ అధికారంలోకి రావడంలోనూ వారి ఎంతో శ్రమిస్తుంటారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.
తాము కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని (TDP) అధికారంలోకి తీసుకొచ్చినా తమను పట్టించుకునేవారు కరువయ్యారనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన అనంతరం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యం దక్కుతోందని వారు మండిపడుతున్నారు. గత 2014 ఎన్నికల అనంతరం టీడీపీలో ఇదే పరిస్థితి కనిపించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి కార్యకర్తల సహకారం లేకపోవడం కూడా ఒక కారణమని విశ్లేషణలు వినిపించాయి.
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. టీడీపీ తరపున ప్రచారం చేసి తప్పు చేశానని ఓ నేత బహిరంగంగా పార్టీ మీద విమర్శలు గుప్పించారు. అనంతపురం అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముక్తియార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. తాను టీడీపీని నమ్మి మోసపోయానన్నారు. నిజమైన కార్యకర్తల సమస్యలను మంత్రి నారా లోకేశ్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలపై చంద్రబాబు, నారా లోకేశ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని వాపోయారు. టీడీపీ కూటమి పాలనలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారికే పదవులు దక్కుతున్నాయని విమర్శించారు. మరి టీడీపీలో ఇదే పరిస్థితి కొనసాగబోతున్నదా? పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
Follow Us On: X(Twitter)


