టీమిండియాలో అంతర్యుద్ధం.. ముగ్గురి భవితవ్యం ప్రశ్నార్థకం!

కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)లో తీవ్ర కలకలం రేగుతున్నది. ఒకవైపు మైదానంలో వరుస పరాజయాలు, మరోవైపు జట్టు అంతర్గత నిర్ణయాల లీకేజీలు భారత క్రికెట్ (Team India)ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ వన్డే భవితవ్యం, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవి, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పై పెరుగుతున్న ఒత్తిడి.. వంటి అంశాలు టీమిండియాలో కీలకంగా మారాయి. దీనికి తోడు జట్టును తీవ్రంగా వేధిస్తున్న గాయాల సంక్షోభం, శ్రీలంక పర్యటన కోసం తీసుకున్న ప్రత్యేక వ్యూహాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు.. వెటరన్ బ్యాటర్ రోహిత్ శర్మతో టీమిండియా 2027 వన్డే ప్రపంచ కప్ గెలవలేదని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అతడిని వన్డే ప్రణాళికల నుంచి పూర్తిగా తప్పించాలని భావించారు. ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ హిట్ మ్యాన్ ను చివరిది కావాలని, ఆ తర్వాత అతడిని పక్కన పెట్టాలని కోచ్ గౌతమ్ గంభీర్ బృందంతోనూ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్ రేసులో సిద్ధంగా ఉండటంతో రోహిత్ పై ఒత్తిడి మరింత పెరిగింది.

నోళ్లు మూయించిప్పటికీ..

కానీ, లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ 110 బంతుల్లోనే 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాది అందరి నోళ్లు మూయించారు. రోహిత్ ఇన్నింగ్స్ తర్వాత బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా.. సెలక్టర్లతో చర్చించకుండానే ఏకపక్షంగా ఒక ప్రకటన విడుదల చేశారు. లార్డ్స్ వన్డే అతనికి చివరిది కాదని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియా ఒత్తిడిని చూసి బోర్డు తమను మోసగించిందని సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

అగార్కర్ పదవికి ముప్పు..

రోహిత్ శర్మ వివాదం, ఈ లీకుల డ్రామా కారణంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవికి ముప్పు పొంచి ఉంది. జూన్ 2026తో అతని అసలు కాంట్రాక్ట్ ముగియగా, బోర్డు అతనికి మూడు నెలల పొడిగింపును ఇచ్చింది. 2027 ప్రపంచ కప్ వరకు అతను ఉంటాడని భావించినప్పటికీ.. వచ్చే నెలలోనే అతడిని పదవి నుండి తొలగించే అవకాశం ఉంది.

వీవీఎస్ కు పగ్గాలు?

గత పర్యటనల్లో (ఐర్లాండ్, ఇంగ్లండ్) 10 మ్యాచ్ లకు గాను 8 మ్యాచ్ లు ఓడిపోవడంపై సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. బీసీసీఐ సెక్రటరీ అనారోగ్యం వల్ల వాయిదా పడిన ఈ సమావేశం త్వరలోనే జరగనుంది. ఈ సమావేశంలోనే అగార్కర్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ అగార్కర్ తప్పుకుంటే.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ కొత్త చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గంభీర్ పై ఒత్తిడి

యూకే పర్యటనలో ఘోర పరాజయాల తర్వాత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా ఒత్తిడి తీవ్రమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా వెనుకబడి ఉండటంతో.. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టెస్ట్ సిరీస్ గంభీర్కు అత్యంత కీలకంగా మారింది. ఇందులో కూడా ఫలితాలు రాకపోతే గంభీర్ భవిష్యత్తుపై బోర్డు కఠిన నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

మాజీల మద్దతు

ఇటువంటి పరిస్థితుల్లో మాజీ సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్, మాజీ క్రీడాకారుడు లాల్చంద్ రాజ్పుత్ వంటి వారు గంభీర్ కు మద్దతుగా నిలిచారు. జట్టు వైఫల్యాలకు కేవలం కోచ్ ఒక్కడినే టార్గెట్ చేయడం సరికాదని, ఆటగాళ్లు కూడా అంతే బాధ్యులన్నారు. రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు టీ20ల నుంచి తప్పుకున్నాక జట్టు ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉందని, అందువల్ల కోచ్కు, కొత్త ఆటగాళ్లకు మరికొంత సమయం ఇవ్వడం అవసరమని తెలిపారు.

గాయాల సంక్షోభం

ఈ అంతర్గత రాజకీయాల నడుమ, మైదానంలో టీమిండియాను ‘గాయాల సంక్షోభం’ తీవ్రంగా వేధిస్తున్నది. స్టార్ పేసర్ బుమ్రా (మోకాలి గాయం), ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లంతా గాయాల పాలై జట్టుకు దూరమవడం లేదా ఎన్సీఏలో కోలుకోవడం చేస్తుండటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా కాలి బొటనవేలి గాయం కారణంగా బెంగళూరులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అతను ఆగస్టు 8 నాటికి శ్రీలంకలో జట్టుతో కలిసే అవకాశం ఉంది.

ఇప్పుడేం చేస్తారో..

లంక పిచ్లపై అలాంటి తప్పులు జరగకుండా బీసీసీఐ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఇందుకోసం హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, తనుష్ కోటియన్, విప్రాజ్ నిగమ్ అనే నలుగురు విభిన్న రకాల స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా శ్రీలంకకు తీసుకెళ్లారు. అలాగే ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పర్యటనకు ముందే ప్రత్యేకంగా కఠిన శిక్షణ పొందారు. మొత్తానికి, మైదానం వెలుపల జరుగుతున్న ఈ అంతర్గత విభేదాలు, గాయాల సవాళ్లు రాబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>