కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల (Jagtial) జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ఎగవేత వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. రూ. 87.89 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించడంతో, బీజేపీ నాయకురాలు, కౌన్సిలర్ కొండ అరుణ కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు కొండ లక్ష్మణ్ ఆయన భార్య జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ కొండ అరుణ దంపతులకు తక్యళ్లపల్లి వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి, లక్ష్మీ బాలాజీ, లక్ష్మీ గణపతి పరిశ్రమల పేరుతో రైస్ మిల్లులు ఉన్నాయి.
ప్రభుత్వం నుండి సేకరించిన ధాన్యానికి తగినట్లుగా 34,386.785 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)కి అప్పగించాల్సి ఉండగా, రూ. 87.89 కోట్ల విలువైన బియ్యాన్ని వీరు ప్రభుత్వానికి అప్పగించకుండా దారి మళ్లించినట్లు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు. ఈ క్రమంలో సివిల్ సప్లై విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కొండ లక్ష్మణ్, ఆయన భార్య కొండ అరుణ, కుమారులు ప్రణీత్, ఉపేందర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
గతంలోనే దాదాపు రూ. 30 కోట్ల మేర బకాయిలు ఉన్నప్పటికీ మళ్లీ ఈ మిల్లులకే ధాన్యం ఎలా కేటాయించారన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు కాగానే కొండ లక్ష్మణ్ కుటుంబం అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ద్వారా కేసుల ఉపసంహరణకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో నిందితులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు పోలీసులు ‘లుక్ అవుట్ సర్క్యులర్’ (LOC) జారీ చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.

