మణుగూరు ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ మందుల కలకలం.. కలెక్టర్ చర్యలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) ఏరియా ఆసుపత్రిలో రోగులకు గడువు ముగిసిన మందులను అందించిన ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కఠిన చర్యలు చేపట్టారు. బాధ్యులైన సిబ్బందిపై విచారణ ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ​ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే జిల్లా కలెక్టర్ అత్యంత తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీసీహెచ్‌ఎస్) అధికారి డాక్టర్ రవిబాబును ఆదేశించారు. నివేదిక ఆధారంగా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక ఫార్మసిస్ట్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు.

అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్‌తో పాటు ఒక నర్సింగ్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌ను చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేయగా, విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పేషెంట్ కేర్ సిబ్బంది సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వాన్ని, నిబంధనల ఉల్లంఘనను భరించేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రుల్లోని మందుల నాణ్యత, గడువు తేదీలు, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణపై ప్రతి స్థాయిలోనూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు రాజీలేని చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>