కలం, మిర్యాలగూడ: గాంధీ జయంతి నాటికి మిర్యాలగూడను చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపల్ సమావేశ హాల్‌లో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మున్సిపాలిటీ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పారిశుధ్య లోపాల వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. శానిటేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, డంపింగ్ యార్డులో బయో మైనింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ జవాన్లు, సిబ్బంది తప్పనిసరిగా ఆన్‌లైన్ హాజరు నమోదు చేయాలని, గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పట్టణంలో గుర్తించిన 30 చెత్త పాయింట్లను పూర్తిగా తొలగించి, అక్టోబర్ 2 నాటికి 4 రకాల చెత్త బాక్సుల ద్వారా వ్యర్థాల సేకరణ చేపడతామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, చికెన్, మటన్ షాపుల వ్యర్థాలు పడేస్తే పెనాల్టీలు విధిస్తామని స్పష్టం చేశారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో బయో డిగ్రేడబుల్ లేదా బట్ట సంచులు వాడేలా హెచ్చరించాలని, వినకపోతే షాపులను సీజ్ చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, వారంలోగా ఆర్‌ఓఆర్ ఎంట్రీలను పెంచాలని ఆదేశించారు. 32 వార్డులకు గాను 25 వార్డులు, 1225 ఎకరాల సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. అమృత్ పథకం కింద నిర్మిస్తున్న ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాన్ని డిసెంబర్ లోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి వార్డు అధికారి వద్ద వార్డు ప్రొఫైల్ తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.16 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యానికి గాను ప్రస్తుతం 20 శాతమే వసూలైందని, ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వికలాంగుల ప్రత్యేక వైకల్య నిర్ధారణ కేంద్రాన్ని, ఊయల కేంద్రాన్ని, డేటా ఎంట్రీ కేంద్రాలను వారు ప్రారంభించారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ మాతృ, ఆర్‌డీఓ రమణారెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

