కలం, కరీంనగర్ బ్యూరో: పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, అన్ని మౌలిక సదుపాయాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) తెలిపారు. బుధవారం నియోజకవర్గంలోని పలు పాఠశాలల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
అనంతరం మొహన్రావుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల, మదాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన విధానంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మదాపూర్ లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ “విద్యార్థులే దేశ భవిష్యత్తు. బాగా చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం కష్టపడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.. ప్రతిభను చాటాలి. ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఉపాధ్యాయులకు, అధికారుల దృష్టికి తీసుకురావాలి” అని ఎమ్మెల్యే సంజయ్ సూచించారు. అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

