కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. వందల్లో, రూ. వేలల్లో చలానాలు పడుతుంటాయి. కానీ, ఒక స్కూటీపై ఏకంగా రూ. 10 లక్షల ఫైన్ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హర్యానా గురుగ్రామ్(Gurugram)లోని రాజీవ్ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ చౌక్ వద్ద హెల్మెట్ లేకుండా తప్పుడు మార్గంలో వెళ్తున్న ఓ యువకుడిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు.. అతన్ని ఆపి బండికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. అయితే సదరు రైడర్ ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఫైన్ల లిస్టు చూస్తే వారి మైండ్ బ్లాంక్ అయ్యింది.
ఆ స్కూటీపై మొత్తం 96 చలనాలు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ మొత్తం కలిపి ఏకంగా రూ. 10 లక్షలుగా తేల్చి పోలీసులే షాక్‌కు గురయ్యారు. రైడర్ ను పట్టుకుని పోలీసులు విచారించారు. సుమారు రూ. 50,000 విలువైన 2017 మోడల్ స్కూటర్ తన సోదరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని రైడర్ వెల్లడించాడు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ప్రకారం స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పట్టుకున్న ఈ స్కూటర్‌పై పడిన చలానాల్లో ఎక్కువ భాగంగా హెల్మెట్ లేకుండా నడపడం, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలేవని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ.. అందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించానలి కోరారు. వాహనాదారులు పెండింగ్ చలాన్లను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సూచించారు.

