కలం, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీస్ (Afghanistan Cricket Series) నిర్వహించేందుకు ఐర్లాండ్ (Ireland) క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళల హక్కులపై తాలిబాన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకూడదని ఇంగ్లాండ్ గతంలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను కొనసాగించడం ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
2021లో తాలిబాన్‌లు ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల క్రీడలపై ఆంక్షలు విధించారు. దీంతో ఆ దేశ మహిళా క్రికెటర్‌లు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం మహిళా క్రికెట్ జట్టు లేని ఏకైక ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశంగా ఆఫ్ఘనిస్థాన్ కొనసాగుతోంది. ఆఫ్ఘన్ శరణార్థి మహిళా క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ మద్దతుగా నిలిచింది. మహిళా హక్కుల ఉల్లంఘనలను నిరసిస్తూ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాలు ఆఫ్ఘనిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉంటున్నాయి. అయితే వెస్టిండీస్, జింబాబ్వే, కొన్ని ఆసియా దేశాలతో పాటు ఐర్లాండ్ మాత్రం ఆఫ్ఘన్‌తో క్రికెట్ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. పరస్పర ఒప్పందంలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఐర్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
అయితే ఐసీసీ టోర్నీలలో పాయింట్లు, టైటిళ్ల పరంగా ఆడాల్సిన పరిస్థితి ఉండటంతో ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లు కొనసాగిస్తోంది. ఇటీవల లాహోర్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇరు జట్లు తలపడ్డాయి. ఐర్లాండ్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ స్థానంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఇంగ్లాండ్ నిర్ణయించినట్లు సమాచారం.

