కలం, నిర్మల్: ప్రజలు సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే “సైబర్ జాగృక్త దివస్” కార్యక్రమంలో భాగంగా భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సైబర్ జాగృక్త దివస్ పోస్టర్లను ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు అత్యాధునిక పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నందున ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐలు రవీందర్ నాయక్, దీపక్, సాయి కుమార్, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

