కలం, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది జరిగే రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై కాంగ్రెస్ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్దరి పదవీకాలం 2027 మార్చిలో ముగియనున్నది. ఇందుకోసం ఓటర్ల (గ్రాడ్యుయేట్లు) నమోదు ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్ మద్దతిచ్చిన స్థానాలు. ఈసారి రెండింటినీ గెల్చుకోవాలన్నది అధికార కాంగ్రెస్ లక్ష్యం. ఇందుకోసం ముందస్తు వ్యూహ రచనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఆరు జిల్లాల పరిధిలో ఈ రెండు స్థానాలు విస్తరించి ఉన్నందున ఆ జిల్లాల్లోని సీనియర్ నేతలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. దీటైన అభ్యర్థులను గుర్తించాల్సిందిగా సూచనలూ వెళ్లాయి. ఈ ఎన్నికల్లో విద్యావంతులు, యువతకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నది.
బీఆర్ఎస్ను ఓడించడమే టార్గెట్
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి 2021 మార్చిలో ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ మద్దతు పలికిన సురభి వాణిదేవీ గెలుపొందారు. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతు పలికిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. కానీ 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో.. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మల్లన్న గెలుపొందారు. ఇప్పుడు వాణిదేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చి 29తో ముగుస్తున్నది. ఆ లోపు ఎన్నికలు జరగాల్సి ఉన్నది.
ఇప్పటికే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. దీంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌వి కాకుండా పోయాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ను వేడించి రెండింటినీ గెల్చుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఆ జిల్లాల్లో పాపులారిటీ ఉన్న నేతలను గుర్తించే పని మొదలుపెట్టింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున జిల్లాల లీడర్ల నుంచి వచ్చే ప్రతిపాదనలకు తగ్గట్టు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఓటర్లందరినీ జాబితాలో చేర్పించేలా..!
కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉన్న అభ్యర్థులను వెతికే పని కాంగ్రెస్‌లో మొదలైంది. విద్యార్థులతో, పట్టభద్రులతో బలమైన సంబంధాలు, ఆదరణ ఉన్న లీడర్లతో పాటు విద్యా సంస్థలతో పరిచయం ఉన్న వ్యక్తులపై పార్టీ ఫోకస్ పెట్టింది. గ్రాడ్యుయేషన్, పీజీ చదువుతున్న స్టూడెంట్లతోపాటు ఉద్యోగుల్లో పరిచయాలు ఉన్నవారికే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించే వరకు వెయిట్ చేయకుండా ఇప్పటినుంచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లను పరిశీలించాలని పార్టీ నుంచి జిల్లాల నేతలకు ఆదేశాలు వెళ్లాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉండటంతో, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, విద్యావంతుల్లో విశ్వసనీయత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువతతో ఉన్న అనుబంధం వంటి అంశాలు కీలకంగా మారతాయి. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఓటర్ల నమోదు ప్రక్రియలో అర్హులైన గ్రాడ్యుయేట్లలో ఒక్కరు కూడా మిస్ కాకుండా పేర్లను జాబితాలో చేర్చడంపై పార్టీ శ్రేణులు, లీడర్లు చొరవ తీసుకోనున్నారు.

