కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ఉరవకొండ (Uravakonda)లో ఈ నెల 3న తీవ్ర ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీడీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ధర్నాకు చేపట్టారు. ఈ క్రమంలో ధర్నాకు ముందే ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి (Visweswara Reddy)ని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 20 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరో 20 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో విశ్వేశ్వర్ రెడ్డితో కలిపి మొత్తం 40 మందిపై కేసులు నమోదయ్యాయి.
అసలేమైందంటే..
ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. విడపనల్ మండలం వేల్పుమడుగులో 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారని.. వాస్తవానికి అది తమ పార్టీ నాయకుడు గోవింద్ కు చెందిన భూమి అని స్థానిక వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఆ భూమికి సంబంధించి హైకోర్టు కూడా గోవింద్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడి కారణంగానే పోలీసులు, రెవెన్యూ అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది.
దీంతో ఈ నెల 3న ఉరవకొండలో టీడీపీ – వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఎంతకీ తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముందస్తుగానే విశ్వేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టి సమస్య సద్దుమణిగేలా చేశారు.

