కలం, నేషనల్ డెస్క్: పాకిస్థాన్ నుంచి చైనాకు సరికొత్త ఎగుమతి వ్యాపారం ఊపందుకుంది. చైనాలో గాడిద మాంసంతో పాటు.. ముఖ్యంగా వాటి చర్మాలకు భారీ డిమాండ్ ఉండటంతో ప్రతిరోజూ వందలాది గాడిదలను ప్రాసెసింగ్ కోసం తరలిస్తున్నది (Donkey Export). ఇందుకోసం బలూచిస్థాన్‌లోని గ్వాదర్ ఫ్రీ జోన్లో చైనాకు చెందిన ‘హ్యాంగెంగ్ గ్రూప్’ సుమారు 50 మిలియన్ డాలర్ల (రూ.400 కోట్లకు పైగా) పెట్టుబడితో అత్యాధునిక వధశాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు వందలాది గాడిదలను ప్రాసెస్ చేస్తుండగా.. రాబోయే నెలల్లో ఈ సంఖ్యను రోజుకు 800 జంతువులకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది.
బంగారానికి ఉన్నంత డిమాండ్
చైనాలో గాడిద చర్మాలకు బంగారంతో సమానమైన డిమాండ్ ఉన్నది. ఇందుకు ప్రధాన కారణం అక్కడి సాంప్రదాయ వైద్యమే. గాడిద చర్మాన్ని గంటల తరబడి ఉడకబెట్టి, దాని నుంచి తీసే కొల్లాజెన్ ద్వారా ‘ఎజియావో’ అనే ప్రత్యేక జిలాటిన్‌ను తయారు చేస్తారు. దీనిని రక్తాన్ని శుద్ధి చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి రకరకాల మందులతో పాటు ప్రీమియం సౌందర్య ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తారు. దీంతో గాడిద చర్మం చైనాలో విలువైన వాణిజ్య వస్తువుగా మారింది.
ఆఫ్రికాలో బ్యాన్.. ఈజీగా దొరికిన పాక్
గతంలో చైనాకు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున గాడిద చర్మాలు సరఫరా అయ్యేవి. అయితే, చైనా అత్యాశ వల్ల ఆఫ్రికాలో గాడిదల జనాభా దారుణంగా పడిపోయింది. దీనిని గమనించిన ‘ఆఫ్రికన్ యూనియన్’ 2024లో గాడిదల వధపై, చర్మాల ఎగుమతిపై పూర్తిగా నిషేధం విధించింది. బ్రెజిల్ కూడా ఇటువంటి నిబంధనలనే కఠినతరం చేసింది. మరోవైపు, తమ దేశంలోనూ గాడిదల జనాభా వేగంగా పడిపోవడంతో ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్న చైనా వ్యాపారులకు పాకిస్థాన్ ఒక సులువైన మార్గంగా దొరికింది.
ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు ఈ వ్యాపారం ఒక పెద్ద వరంగా మారింది. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం పాకిస్థాన్‌లో 60 లక్షల కంటే ఎక్కువ గాడిదలు ఉన్నాయి. ఈ భారీ జంతు సంపదను ఆధారంగా చేసుకుని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని పాక్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో చైనాతో ప్రత్యేక నిబంధనలపై ఒప్పందాలు చేసుకుంది.
ఇప్పటికే జులైలో తొలి విడత గాడిద మాంసాన్ని చైనాకు ఎగుమతి చేసినట్లు సమాచారం. ఈ వ్యాపారం ద్వారా రాబోయే రెండేళ్లలో నెలకు 7 మిలియన్ డాలర్ల మేర విదేశీ మారకద్రవ్యం సంపాదించవచ్చని హ్యాంగెంగ్ గ్రూప్ సీఈవో ఆండీ లియావో పేర్కొన్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ.700 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నమాట.
దేశీయ మార్కెట్‌కు దూరంగా..
ఈ గాడిద మాంసం దేశీయ ఆహార మార్కెట్లోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. గాడిదల ప్రాసెసింగ్ యూనిట్లను కేవలం గ్వాదర్ ఫ్రీ జోన్‌కే పరిమితం చేసింది. అంతేకాకుండా.. దేశంలో రవాణా, ఇతర పనులకు ఉపయోగించే గాడిదల సంఖ్య తగ్గిపోకుండా ప్రత్యేకంగా గాడిదల పెంపకం ఫారాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పేదల జీవనాధారానికి దెబ్బ?
పాకిస్థాన్‌లోని 60 లక్షలకు పైగా ఉన్న గాడిదలు కేవలం జంతు సంపద మాత్రమే కాదు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పేదలు, ఇటుక బట్టీల కార్మికులు, చిన్న వ్యాపారులకు గాడిదలే రవాణా, జీవనోపాధికి ఆధారం. ఇప్పుడు చైనా కంపెనీలు భారీ ధరలు చెల్లించి గాడిదలను కొనుగోలు చేస్తుండటంతో.. స్థానిక మార్కెట్లో వాటి ధరలు పెరుగుతున్నాయి.
దీంతో కొత్త గాడిదలను కొనుగోలు చేయలేని పేదలు.. తమ జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చైనా కంపెనీ సుమారు 500 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతుండగా.. మరోవైపు గాడిదలపై ఆధారపడే పెద్ద సంఖ్యలో ప్రజల సంప్రదాయ జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక కోణం చైనా-పాక్ ఆర్థిక సంబంధాలు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌లో గ్వాదర్ పోర్ట్ కీలక భాగం. చైనా పెట్టుబడులు, రుణాలపై పాకిస్థాన్ ఆధారపడుతున్న నేపథ్యంలో.. గ్వాదర్‌లోనే ఈ కొత్త గాడిదల వ్యాపారం మొదలవడం చర్చకు దారితీస్తున్నది. చైనాకు చెల్లించాల్సిన రుణాలు, వడ్డీల భారం నేపథ్యంలో పాక్ తన సహజ వనరులను, జంతు సంపదను కూడా ఆదాయ వనరులుగా మార్చుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో నెలకు 7 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం వస్తుందన్న అంచనాలు పాక్‌కు ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ఆదాయం కోసం దేశ పర్యావరణ సమతుల్యత, జంతు సంపద, గ్రామీణ జీవనోపాధిపై ఎంతటి భారం పడుతుందన్నది ప్రశ్నగా మారింది.
జంతు సంరక్షణ సంస్థల ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా ‘డాంకీ శాంక్చురీ’ వంటి అంతర్జాతీయ జంతు సంరక్షణ సంస్థలు ఈ క్రూరమైన చర్మాల వ్యాపారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గాడిదలను అక్రమంగా, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వధశాలలకు తరలించడం మానవీయ కోణాన్ని ప్రశ్నిస్తున్నది. దీనికి తోడు, గతంలో ఆఫ్రికాలో చూసినట్లే, గాడిద చర్మాలకు డిమాండ్ పెరిగే కొద్దీ పాకిస్థాన్‌లో కూడా గ్రామీణ ప్రాం
తాల్లో గాడిదల దొంగతనాలు, చట్టవిరుద్ధమైన నకిలీ వధశాలలు, స్మగ్లింగ్ ముఠాలు పెరిగే ప్రమాదం ఉంది. దేశీయ ఆహార సరఫరాలోకి ఈ మాంసం కలవకుండా కేవలం గ్వాదర్ ఫ్రీ జోన్‌కే ఈ యూనిట్లను పరిమితం చేశామని పాక్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అవినీతి ఎక్కువగా ఉన్న వ్యవస్థలో అక్రమ మాంసం విక్రయాలను అడ్డుకోవడం ఎంతవరకు సాధ్యమనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

