కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర పరిశుభ్రతను మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన పారిశుద్ధ్య వాహనాలు వినియోగంలోకి రాకుండా నెలల తరబడి షెడ్లకే పరిమితమవుతున్నాయి. చెత్త సేకరణ వాహనాలు షోరూంలో వరుసగా నిలిపిన వాహనాలను తలపించేలా షోకేజ్ వస్తువులయ్యాయి. దాదాపు నాలుగు నెలలుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దుమ్ము పట్టిపోతున్నాయని స్థానికులు అంటున్నారు.
సిబ్బంది లేక..!
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (Warangal GWMC) స్మార్ట్ సిటీ నిధుల నుంచి సుమారు రూ.12 కోట్లతో ఇటీవల 120 కొత్త పారిశుద్ధ్య వాహనాలను కొనుగోలు చేసింది. వీటిలో 3 డోజర్లు, 14 ట్రాక్టర్లు, 103 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 352 పారిశుద్ధ్య వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ కొత్త వాహనాల ద్వారా కార్పొరేషన్ అన్ని డివిజన్లలో ఇంటింటికీ చెత్త సేకరణను వేగవంతం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని అధికారులు నిర్ణయించారు. అయితే వాహనాల కొనుగోలు పూర్తయినప్పటికీ వాటిని నడిపేందుకు అవసరమైన డ్రైవర్లు, సిబ్బందిని నియమించకపోవడంతో అవన్నీ షెడ్లకే పరిమితమయ్యాయి.
పాత వాహనాలతోనే..!
కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ పాత వాహనాల ద్వారానే చెత్త సేకరణ కొనసాగుతున్నది. తరచూ పాత వాహనాలు రిపేర్లు అవుతుండగా చెత్త సేకరణలో ఇబ్బందులు వస్తున్నాయి. అయినా కొత్త వాహనాలను వాడకంలోకి తీసుకురావడంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకేచోట నెలల తరబడి నిలిపివేయడం వల్ల కొత్త వాహనాల టైర్లు, బ్యాటరీలు, ఇంజిన్ విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డ్రైవర్లు, సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాలను క్రమం తప్పకుండా నడపకపోతే భవిష్యత్తులో నిర్వహణ వ్యయం మరింత పెరిగే అవకాశముందని సూచిస్తున్నారు. ఉన్న సిబ్బందికైనా కొత్త వాహనాలు ఇవ్వకుండా షెడ్లకు పరిమితం చేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వెంటనే వినియోగంలోకి తేవాలి
వరంగల్ సిటీలో పారిశుద్ధ్య సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడం, కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంపై ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలు వినియోగంలో లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. వెంటనే డ్రైవర్ల నియామకం చేపట్టి, కొత్త వాహనాలను రోడ్లపైకి దించి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ఆలస్యం చేయకుండా వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.
ప్రణాళికా లోపమే కారణమా?
డ్రైవర్ల నియామకం, సిబ్బంది లభ్యత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక లేకుండానే వాహనాల కొనుగోలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా డ్రైవర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, అనంతరం వాహనాలు కొనుగోలు చేసి ఉంటే ప్రజాధనం వృథా అయ్యేది కాదని అంటున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలు షెడ్లలోనే నిలిచిపోవడం అధికార యంత్రాంగం ప్రణాళికా వైఫల్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

